తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఉగాది సందర్భంగా రాష్ట్ర రైతులకు శుభవార్త అందించారు. ఈ నెల 22న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, సాదా బైనామా భూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పంచాంగాన్ని ఆవిష్కరించి ప్రార్థనలు చేశారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. ధరణి వల్ల తలెత్తిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ, 'భూ భారతీ' ద్వారా భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. సాదా బైనామా భూముల అంశంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతును ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు, బోనస్, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు వ్యవసాయాభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ.20,616 కోట్ల రుణమాఫీ అమలు చేసినట్లు, ప్రతి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా అందిస్తున్నామని, ఇప్పటివరకు సుమారు రూ.18 వేల కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.







