వరి ధాన్యం సకాలంలో తరలింపునకు అవసరమైన వాహనాలను సమీకరించాలని తెలంగాణ రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా రవాణా అధికారులకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వేగంగా చేరవేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ధాన్యం రవాణా ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని, అందుకు అవసరమైన గూడ్స్ వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రవాణా వాహనాలన్నీ నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా నడపాలని, వాటికి సంబంధించిన అన్ని పత్రాలు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలని ఆదేశించారు.
ప్రతి వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ), ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, అలాగే డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఈ పత్రాలు లేని వాహనాలను రవాణాకు అనుమతించరాదని సూచించారు.
ధాన్యం రవాణా సజావుగా జరిగేలా చూడటంలో భాగంగా, సంబంధిత కలెక్టర్లు మరియు పౌరసరఫరాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం సకాలంలో మిల్లులకు చేరడం ద్వారా తదుపరి ప్రక్రియ వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.











