సంగారెడ్డి, జూలై 31
రాష్ట్రంలో వాతావరణ మార్పులు, భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే వారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠం చేయాలని సూచించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న వాతావరణ మార్పులు, భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే వారంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.
ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠంగా సిద్ధం చేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండుతో కలిసి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, పశుసంవర్ధక, విద్య, మత్స్య, పోలీస్ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేయాలని చెప్పారు.
గ్రామాలు, పట్టణాల్లో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాత భవనాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల వారీగా పూర్తి వివరాలను అన్ని శాఖలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.











