వెల్దుర్తి మండలంలోని రామచంద్రాపురం తండాలో అర్ధరాత్రి జరుగుతున్న బాల్య వివాహాన్ని ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా చొరవతో అధికారులు అడ్డుకున్నారు. బాలిక మైనర్‌గా ఉన్నట్లు నిర్ధారించుకుని, వివాహాన్ని నిలిపివేసి, బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు.
మైనర్ బాలికకు వివాహం జరుగుతున్నట్లు అర్ధరాత్రి 2 గంటలకు అందిన సమాచారంపై ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా తక్షణమే స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు వెల్దుర్తి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఎస్.ఐ, ఐ.సి.డి.ఎస్ మరియు చైల్డ్‌లైన్ ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
సంఘటనా స్థలంలో అధికారులు బాలిక వయస్సు ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. బాలిక వయస్సు చట్టబద్ధమైన వివాహ వయస్సు కంటే తక్కువగా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు.
చట్టపరమైన చర్యల నేపథ్యంలో, అధికారులు బాల్య వివాహాన్ని నిలిపివేశారు. బాలిక భద్రత దృష్ట్యా, ఆమెను తగిన సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం, బాలికలకు 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, పిల్లల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.











