2027 జూన్‌లో జరగబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరఘాట్ల అభివృద్ధి, ఆలయాల పునరుద్ధరణ, భక్తుల సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు.
శాసనసభ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో, బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆలయాలు, పుష్కరఘాట్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2027 జూన్ నాటికి పూర్తి చేయాల్సిన పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రణాళికలను వివరించారు.
ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించడానికి ఇంజనీర్లతో కూడిన టెక్నికల్ కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి, 15 నుంచి 20 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని సూచించారు.
ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో నివేదికను రూపొందించి మంత్రివర్గ ఉపసంఘానికి పంపాలని, ఆమోదం పొందిన తర్వాత మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పుష్కరాల కోసం శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని, వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణ చేపట్టాలని, భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచాలని సూచించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై కూడా ముఖ్యమంత్రి సూచనలు చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.











