రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్యకు జూన్ 2వ తేదీ నాటికి ఒక కొలిక్కి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్, జర్నలిస్ట్స్ హౌసింగ్, డెక్కన్ జర్నలిస్ట్స్, తెలంగాణ హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు అందరి అభిప్రాయాలను సేకరించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల ఏర్పాటు, సభ్యుల సంఖ్య, అర్హతలు వంటి అంశాలపై మంత్రి ఆరా తీశారు. జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ మినహా మిగిలిన మూడు సొసైటీలలో సుమారు 2,424 మంది అర్హులైన జర్నలిస్టులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జర్నలిస్టులందరూ ఒకేతాటిపై ఉంటే సమస్యల పరిష్కారం సులభమవుతుందని, అన్ని సొసైటీలు కలిసి ఒకే వేదికపైకి వచ్చి జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులు కాని అర్హులైన జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఎటువంటి విమర్శలకు తావులేకుండా కేటాయింపులు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదేనని, ఇప్పుడు కూడా 18 ఏళ్లుగా పరిష్కారం కాని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సమస్యను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఎమ్మెల్యేలు, బ్యూరో క్రాట్స్తో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు తమ సొసైటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిని కోరారు.











