సంగారెడ్డి, జూలై 17
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో జిల్లా పోలీసు ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్ తో కలిసి ఆయన జైలు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఖైదీల ప్రవర్తన, నిషేధిత వస్తువుల రవాణా, సీసీ కెమెరాల పనితీరు వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని సెంట్రల్ జైలును జిల్లా పోలీసు ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్ తో కలిసి జైలు భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జైలు ఆవరణ, ప్రధాన ప్రవేశ ద్వారాలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధులు వంటి భద్రతా అంశాలను పరిశీలించారు.
జైలులోని ఖైదీల ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షిస్తూ, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. నిషేధిత, హానికరమైన వస్తువులు జైలు లోపలికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జైలులో భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఆకస్మిక తనిఖీలను తరచూ నిర్వహించాలని, సందర్శకుల తనిఖీలను అత్యంత కట్టుదిట్టంగా చేపట్టి ప్రతి ఒక్కరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
జైలు పరిసరాల్లో 24 గంటల పాటు నిరంతర నిఘా కొనసాగించాలని, సీసీ కెమెరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు. జైలు గోడలు, ప్రవేశ ద్వారాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేసి, సెంట్రీ విధులను అప్రమత్తంగా నిర్వహించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందికి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని, జైలు భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలో పోలీసు శాఖ, జైలు శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.
వీరి వెంట అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఇతర జైలు అధికారులు తదితరులు ఉన్నారు.











