లొంగిపోయిన మావోయిస్టులు మెరుగైన జీవితాన్ని గడిపేలా ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీసుల నిరంతర ప్రయత్నాల ఫలితంగానే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తమ కార్యకలాపాలను విడిచిపెట్టి, జనజీవనంలోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మావోయిస్టులలో ప్రభుత్వంపట్ల నమ్మకాన్ని పెంపొందించడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి ప్రశంసించారు. వారిని తిరిగి సమాజంలో కలపడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా, మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలో విశేషంగా కృషి చేసిన డీజీపీ శివధర్‌రెడ్డి, డీఐజీ సుమతిలను ముఖ్యమంత్రి అభినందించారు. వారి అంకితభావం, నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, భద్రతా చర్యల నేపథ్యంలో అనేక మంది మావోయిస్టులు అడవులను వీడి, చట్టబద్ధమైన జీవితాన్ని గడపడానికి ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

