ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన దరఖాస్తులను జాప్యం చేయకుండా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో కాంతమ్మతో కలిసి ఆయన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎంతో దూరం నుండి ఎన్నో ఆశలతో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కార ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఒకవేళ ఏదైనా దరఖాస్తును తిరస్కరించాల్సి వచ్చినా, దానికి గల స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తప్పనిసరిగా వివరించాలని సూచించారు.
అలాగే, స్వీకరించిన అర్జీలపై తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి మొత్తం 181 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖలకు బదిలీ చేసి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.











