సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, మహిళా సాధికారత కేంద్రం సహకారంతో బేటీ జన్మోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పుట్టిన ఆడ శిశువులను గౌరవిస్తూ బేటీ జన్మోత్సవ కిట్లు మరియు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు.
బాలిక జననాన్ని ఆనందంగా జరుపుకోవడం ద్వారా సమాజంలో బాలికల పట్ల గౌరవ భావన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించారు.
జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి మాట్లాడుతూ.. బాలికల రక్షణ, విద్య మరియు సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఎంతో కీలకమని తెలిపారు. బాలిక పుట్టినప్పటి నుంచే సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు మరియు మహిళలకు అవసరమైన వైద్య సేవలు, రక్షణ మరియు సదుపాయాలను సమయానికి అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడటం తమ ముఖ్య బాధ్యతగా భావిస్తూ అన్ని రకాల సదుపాయాలను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
నారాయణఖేడ్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సుజాత గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పోషకాహారం, గర్భధారణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు మరియు చిన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. పిల్లలను క్రమం తప్పకుండా పరిశీలించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగు పరచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.








