నిజామాబాద్, జూలై 21
నిజామాబాద్ నగరంలో పోచమ్మ ఆలయం సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 65-75 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని గుర్తింపునకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
నిజామాబాద్ నగరంలోని పోచమ్మతల్లి ఆలయం ఎదురుగా ఉన్న ఓ మెడికల్ షాప్ సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
టౌన్-1 పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 19న సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్య సుమారు 65 నుంచి 75 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి అపస్మారక స్థితిలో పడిఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం, ఇతర చట్టపరమైన ప్రక్రియల కోసం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగించే వ్యక్తిగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి గుర్తింపునకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఆయన వివరాలు తెలిసిన వారు నిజామాబాద్ టౌన్-1 పోలీస్ స్టేషన్ లేదా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని టౌన్ -1 సబ్ ఇన్స్పెక్టర్ బి. రఘుపతి కోరారు.












