నిజామాబాద్, జూలై 30
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నిజామాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడి, కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జనజీవనం స్తంభించి, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టింది. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడటంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చల్లటి గాలులకు జనం ఇంటికే పరిమితమవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. అత్యవసర ప్రయాణాలు మాత్రమే చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు.
వర్షాల కారణంగా రోడ్లన్నీ బురదమయంగా మారాయి. డ్రైయినేజీ కాల్వల్లో నీళ్లు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు కూడా గణనీయంగా తగ్గింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి.











