ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ చొరవతో, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' కింద ఈ స్టేషన్ అభివృద్ధికి రూ. 37.25 కోట్లను మంజూరు చేసింది.
రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో, పిఠాపురం స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టబడతాయి. ఈ నిధులను ఉపయోగించి స్టేషన్ ప్రధాన భవనం, ముఖద్వారం, ప్లాట్‌ఫారమ్‌లు, షెల్టర్లు, దివ్యాంగుల సౌకర్యాలు, అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్ పనులను మెరుగుపరచనున్నారు.
కొన్ని నెలల క్రితం, పవన్ కల్యాణ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమై, పిఠాపురం స్టేషన్ అభివృద్ధి ఆవశ్యకతను, ముఖ్యంగా యాత్రికులకు మెరుగైన సౌకర్యాల కల్పన ప్రాముఖ్యతను వివరించారు. అమృత్ భారత్ పథకం కింద స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గతంలో పిఠాపురం స్టేషన్‌ను సందర్శించినప్పుడు, పవన్ కల్యాణ్ అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేసి, తక్షణ చర్యలకు ఆదేశించారు. అప్పటి నుంచే స్టేషన్ అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు.











