రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన, ప్రజానుకూల సేవలు అందించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీలు) అమలుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర పోలీస్ డీజీపీ సి.వి. ఆనంద్ సూచించారు.
శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ పోలీస్ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో ప్రజలకు అందించే సేవలు, ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, దర్యాప్తు, బాధితులకు సహాయం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాల్లో ఏకరీతి విధానాలు పాటించాలని ఆదేశించారు.
ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, అక్రమ కార్యకలాపాల అరికట్టడం, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై కూడా డీజీపీ మార్గనిర్దేశం చేశారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా పారదర్శకంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.












