ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును పెండింగ్లో ఉంచకుండా వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులకు సూచించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన 49 దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వినతిని ప్రాధాన్యతతో పరిగణించి సంబంధిత శాఖ అధికారులు నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు వినిపించే ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








