వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు, యువకులు నీటి వనరుల వద్ద అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., తల్లిదండ్రులకు, ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు.
పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, విద్యార్థులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ కోరారు. సరదా కోసం పిల్లలు, యువకులు గ్రామాలు, పట్టణాల శివార్లలోని కుంటలు, చెరువులు, కాలువలు, బావుల వద్దకు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని ఆయన సూచించారు.
గతంలో ఇలాంటి ప్రమాదకర జలాశయాల్లోకి వెళ్లి పలువురు మృత్యువాత పడి కుటుంబాలకు తీరని విషాదం మిగిల్చిన సంఘటనలు ఉన్నాయని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. ఈతకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సరదాగా వెళ్లిన పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ, వారు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈత రాకపోతే కలిగే ప్రమాదాల గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని సూచించారు. జలాశయాలు, బావులు, కాలువలు, చెరువులు, కుంటల్లో ఈత కొట్టేముందు, ఈత తెలిసిన వారు కూడా నీటి లోతును కర్రల సాయంతో ముందుగా పరిశీలించుకోవాలన్నారు. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటే ఈతకు వెళ్లకూడదని, విహారయాత్రలు లేదా తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు లోతు తక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే స్నానం చేయాలని సూచించారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చెరువులు, కొలనులు, జలపాతాలు, నీటి కుంటలు, ఏరుల వద్దకు ఎవరూ ఈతకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. చెరువులు, బావులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, నీటి లోతును తెలియజేసే సూచనలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట ముళ్ల కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం సంభవించిన వెంటనే డయల్ 112 కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.











