హైదరాబాద్లోని బంజారాహిల్స్లో సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయించి, రూ.1000 కోట్ల నిధులను విడుదల చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లాలో కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జనాభా మూడవ స్థానంలో ఉందని, వారి జనాభాకు అనుగుణంగా, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఈ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ డిమాండ్ల సాధన కోసం మే 19న రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ముందు నిరసన ధర్నా, మే 30న శ్రీశైలం హైవేపై సడక్ బంద్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 15న కొండారెడ్డిపల్లె నుండి హైదరాబాద్ అమరవీరుల స్తూపం వరకు మహా పాదయాత్ర చేపడతామని పేర్కొన్నారు.
లంబాడి ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ దేవాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, తెలుగు రాష్ట్రాలలో లక్షల కోట్లు ఇతర దేవాలయాలకు కేటాయించినప్పటికీ, బంజారాల ఆరాధ్య దైవానికి మాత్రం ఎలాంటి నిధులు విడుదల చేయలేదని వారు ఆరోపించారు.
సేవాలాల్ మహారాజ్ బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, వారిని ఐక్యపరిచిన మహానుభావులని, అలాంటి వారి ఆలయాన్ని బంజారాహిల్స్లోనే నిర్మించాలని సంఘాల నాయకులు ధరావత్ మోతిరాం నాయక్, వెంకన్న, సర్పంచ్ సదర్ నాయక్, మాజీ ఎంపిటిసి శీను నాయక్, దేవిసింగ్ నాయక్, కైలాస్ నాయక్, అడ్వకేట్ అసోసియేషన్ సిద్ధిరాములు ఆజాద్, పలువురు నాయకులు, ప్రజా సంఘాలు మాట్లాడుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.











