తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వాన్ని గద్దె దించుతామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హెచ్చరించారు. ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గిద్దె రాజేష్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలు గడిచినా, వికలాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా, వికలాంగుల పెన్షన్ ను 6000 రూపాయలకు పెంచాలని, తీవ్ర వైకల్యం ఉన్నవారికి 15,000 రూపాయలు అందించాలని, 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ జీవో 34 ప్రకారం అన్ని జిల్లాలలో వికలాంగుల స్వతంత్ర కార్యాలయాలను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ విద్యార్థులకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని, 2024 డీఎస్సీలో అర్హత సాధించిన స్పెషల్ బిఎడ్ అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకుంటే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వికలాంగులను ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని గిద్దె రాజేష్ స్పష్టం చేశారు. ఈ నిరాహార దీక్షకు పలువురు నాయకులు, సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు.











