సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనవరి 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులు, పోలీస్ మరియు రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య అధికారులను ఆదేశించారు. జాప్యం చేసినట్లు దృష్టికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద వివిధ శాఖల ద్వారా వెచ్చిస్తున్న నిధులు, తదితర అంశాలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదలకు సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని, ఎస్సీ, ఎస్టీల సమస్యల పట్ల మానవతా దృక్పథంతో పనిచేయాలనిసూచించారు. పదోన్నతుల్లో, రోస్టర్ అమలులో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే సహించబోమని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్పొరేషన్ల ద్వారా అమలవుతున్న పథకాలు అర్హులైన పేదలకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అట్రాసిటీ కేసులలో బాధితులకు చెల్లించాల్సిన పెండింగ్ నిధుల కోసం వెంటనే ప్రతిపాదనలు పంపాలని, అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకం, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద కావలసిన నిధులకు ప్రతిపాదనలు పంపితే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ప్రతి గ్రామంలో అంగన్వాడీ , గ్రామ పంచాయితీ భవనాలు, గోదాము, మహిళా భవనము, పాఠశాల కాంపౌండ్ నిర్మాణాలకు తక్షణమే మంజూరులు పొందాలని సూచించారు. జిల్లాలో నిధులు అందుబాటులో ఉన్నందున మంజూరులు తీసుకో వలసిన బాధ్యత ఎంపీడీవోలదని పేర్కొన్నారు. అనంతరం పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన పది మంది ఎస్సీ రైతులకు డ్రాఫ్ట్ పాస్‌బుక్‌లను అందజేశారు. పలువురు ఎస్సీ, ఎస్టీలు తమ సమస్యలపై అందజేసిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, జిల్లా శంకర్, అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అఖిలేష్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, డీఎస్పీలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
Published On: January 6, 2026 7:35 pm