విద్యార్థులు లక్ష్యంతో చదవండి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనవరి 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యార్థులు లక్ష్యంతో, ప్రణాళికాబద్ధంగా చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం జిన్నారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బా బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులు పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. సిలబస్ పూర్తి అయిందా, ప్రాక్టికల్స్ ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, హాల్ టికెట్లు వచ్చాయా, పరీక్షా కేంద్రాల వివరాలు తెలుసుకున్నారా.. అంటూ ఆరా తీశారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షలకు ఎంతమంది సిద్ధమవుతున్నారో, ఏ పరీక్షలు రాయాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి మంచి కళాశాలల్లో సీట్లు పొందేలా కష్టపడి చదవాలని ప్రోత్సహించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే సరైన ప్రణాళికతో చదువును ప్రారంభించాలని ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సూచించారు.మీ కెరియర్ మొత్తం ఇంటర్ చదువుతోనే నిర్ణయమవుతుందని, క్రమశిక్షణతో, లక్ష్యంతో చదివితే తప్పకుండా విజయం మీ సొంతమవుతుందని కలెక్టర్ విద్యార్థులకు హితవు చేశారు. అనంతరం కస్తూర్బా బాలిక విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పలు తరగతులను కలియతిరిగి పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి సిలబస్ పురోగతి, ప్రతిరోజూ జరుగుతున్న ప్రత్యేక తరగతులు, బోధిస్తున్న సబ్జెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతపై అడగగా విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర సమస్యలు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులు జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేలా లక్ష్యంతో చదవాలని కలెక్టర్ సూచించారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగండి అంటూ విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, కస్తూర్బా బాలిక విద్యాలయ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment