*యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి:* *తారా కళాశాల ప్రిన్సిపాల్ రత్నప్రసాద్*

IMG 20240813 144120
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్, విభాగాలు, కామర్స్ విభాగం ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఎస్.ఎస్.రత్నప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వము భారత దేశాన్ని మత్తు పదార్థాల వినియోగ రహిత దేశంగా మార్చాలనే ఉద్దేశ్యముతో “నషా ముక్తి భారత్ అభియాన్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. దీనిని సంపూర్ణంగా అమలు పర్చాలనే ఉద్దేశ్యంతో దేశం మొత్తంలో మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించుటకు అనేక రకాల చర్యలను తీసుకుంటుందని చెప్పారు. మత్తు పదార్థాలను అంటే గంజాయి, హెరాయిన్, ఆల్ఫెండజోల్ వంటి వాటిని అక్రమంగా తయారు చేయడం, అమ్మడం, కొనడం నేరం అని అన్నారు. 15 నుండి 30 సంవత్సరాల లోపు యువత ఈ మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలతో పాటు ధూమపానం, మద్యపానం, కూడా నేరమని, వీటన్నింటికీ యువతరం దూరంగా ఉండాలని అన్నారు. యువతలో మత్తుపదార్థాలపై అవగాహన కలిగించుటకు విద్యార్థులచే నేను మత్తు పదార్థాలను ముట్టనని, మత్తు పదార్థాలను వినియోగించే వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసుల వంటి ప్రభుత్వ సంస్థలకు అందిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. సంగారెడ్డి జిల్లాలో మత్తు పదార్థాల తయారీ వినియోగం అధికంగా ఉండడం ప్రధానంగా ఇంజనీరింగ్, మెడికల్ డిగ్రీ కళాశాలలో ఇది వివిధ రూపాలలో మహమ్మారిగా విస్తరించడం బాధాకరమని అన్నారు. కావున విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండటమే కాకుండా ప్రజలకు అవగాహన కలిగించాల్సిన బాధ్యత మన పైన ఉందని ప్రిన్సిపాల్ రత్న ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి.జగదీశ్వర్, అధ్యాపక బృందం డాక్టర్ మిథున్ రాథోడ్, డాక్టర్ నాగప్రసాద్, కామర్స్ విభాగ అధిపతి డాక్టర్ వీరేందర్, ఇతర కామర్స్ అధ్యాపక బృందం విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now