వ‌చ్చే 24 గంట‌లు మరింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి: మంత్రులు పొంగులేటి, తుమ్మల, సీ.ఎస్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వ్యాప్తంగా ఎడbతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వరద పరిస్థితులపై సమీక్ష జరిపారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అవసరమైన చోట ఈ నిధులను వెచ్చించాలని, ఇంకనూ అవసరమైతే నిధులు కేటాయిస్తామని, నిధుల సమస్య ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. గ‌డ‌చిన మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ, మ‌రికొన్ని ప్రాంతాల్లో త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని వీటిని దృష్టిలో పెట్టుకొని వ‌చ్చే రోజుల్లో త‌గిన జాగ్ర‌తలుతీసుకోవాల‌న్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించేందుకు గాను ఉమ్మ‌డి ప‌ది జిల్లాల‌కు సీనియ‌ర్ అధికారుల‌ను ప్రత్యేక అధికారులుగా నియ‌మించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కు పిలిపించాల‌ని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. రైల్వే లైన్లు, లోలెవెల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలు, లోత‌ట్టు ప్రాంతాలపై ప్ర‌త్యేక దృష్టి సారించి వ‌ర్షం నీరు నిల్వ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ముఖ్యంగా లోలెవెల్ బ్రిడ్జీల ద‌గ్గ‌ర పోలీసు సిబ్బందిని నియ‌మించాల‌ని సూచించారు. అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా తగిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అలాగే త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. చిన్న చిన్న వ‌ర్షాలు 200 మిల్లీమీట‌ర్ల‌కే బ్యాక్ వాట‌ర్ వ‌ల్ల అక్క‌డున్న ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించ‌వ‌ల‌సి వ‌స్తుంద‌ని దీనికి శాశ్వ‌త ప‌రిష్కారం కోసం అక్క‌డున్న‌ వారిని త‌ర‌లించి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. వర్షాలకు విద్యుత్ వైర్లు తెగిపోయినట్లైతే, తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని, రోడ్లు తెగిపోయిన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ట్రాఫిక్ అంతరాయం లేకుండా, సాధారణ జన జీవనానికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు కలుషితం కాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేస్తూ భారీ వర్ష పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ… జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షాలు కురుస్తున్నాయని, గురువారం ఉదయం సగటున 3.9 ఏం.ఏం వర్షపాతం నమోదైందని మంత్రులు, సీ.ఎస్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయినప్పటికీ రానున్న 24 గంటల పాటు భారీ వర్ష సూచన దృష్ట్యా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, ఎలాంటి పరిస్థితి తలెత్తిన సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సన్నద్ధమై ఉన్నారని తెలిపారు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశామని, ముందస్తుగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు సిబ్బంది అందరూ కార్యాలయాలలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు, కంట్రోల్ రూమ్ గురించిన సమాచారం విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రజలకు ఎక్కడైనా వర్షాల కారణంగా ఇబ్బందులు సమస్యలు తలెత్తిన వెంటనే కంట్రోల్ రూమ్ 08455- 276155కు ఫోన్ చేసి చెప్తే సమస్య పరిష్కరించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ముందు జాగ్రత్తగా నారాయణఖేడ్ జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని రోడ్డు సౌకర్యం సరిగా లేని మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణీ స్త్రీలను ముందు జాగ్రత్తగా ఆసుపత్రులకు తరలించి సాంద్ర చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ, విద్యుత్ నీటి పారుదల శాఖ వైద్య ఆరోగ్యశాఖ పోలీస్ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ పరిస్థితులు తక్షణ పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment