నార్సింగిలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం..!

విద్యార్థులు చదివారు కానీ.. గుర్తింపు లేదు….!!

ఆన్‌లైన్‌లో తప్పుల తడక…!

ఆఫ్‌లైన్‌లో విద్యార్థుల కన్నీళ్లు..!

అందరూ చదువుతున్నారు…!

కానీ ప్రభుత్వ రికార్డుల్లో లేరు..!

విద్యాశాఖ స్పందించి పరిష్కరించాలి.

మెదక్/నార్సింగి, జూలై 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యనభ్యసించిన విద్యార్థుల పేర్లు, తరగతులు ( ఒకటో తరగతి నుంచి 5 వరకు), ఇతర కీలక వివరాలను సంబంధిత పాఠశాలలు ప్రభుత్వ విద్యా పోర్టల్‌లో తప్పుల తడకగా, తారుమారు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల వివరాలను సరిగా నమోదు చేయకపోవడంతో ఇప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి మండల కేంద్రంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచే విద్యార్థుల వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేయకుండానే తరగతులు నిర్వహించాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు సంవత్సరాంతంలో ఇతర పాఠశాలలకు బదిలీ కావాలనుకున్నపుడు తమ పేర్లు విద్యా శాఖ పోర్టల్‌లో లేవని తెలుసుకుని అవాక్కయ్యారు. పేర్లు, తరగతులు, తల్లిదండ్రుల వివరాల్లో అనేక పొరపాట్లు ఉండటంతో కొత్త పాఠశాలలు అడ్మిషన్ ప్రక్రియలో జాప్యం చేస్తున్నాయని తెలిసింది. మరింత దిగ్భ్రాంతికరంగా ఉన్న విషయం ఏంటంటే, ఒక ప్రైవేట్ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి ఏ రకమైన గుర్తింపు లేకుండానే విద్యా సంవత్సరం నడిపిందని పలువురు తల్లిదండ్రులు పేర్కొన్నారు. గుర్తింపు లేకుండా విద్యను నిర్వహించడమే కాకుండా, విద్యార్థుల పేర్లను కూడా ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయలేదు. ఇప్పుడీ పాఠశాల నుంచి ఇతర గుర్తింపు పొందిన పాఠశాలలకు మారాలని చూస్తున్న విద్యార్థులకు తలనొప్పులు తప్పడం లేదు. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు మండల విద్యాధికారి కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. పాఠశాల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల పిల్లలు బలయ్యే పరిస్థితి తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు సమస్యలు పరిష్కరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now