దారికొచ్చిన ఎన్డీఏ సర్కార్…

అలవాటైన పద్ధతిలో వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి కాసేపటికే తత్వం బోధపడినట్టుంది. విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపటానికి అంగీకరించింది.కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జేపీసీకి లేదా సెలెక్ట్‌ కమిటీకి పంపటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంద ర్భాల్లో మాత్రమే పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు కొన్ని నెలలముందు అమల్లోకొచ్చిన భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆదరా బాదరాగా ఆర్డినెన్స్‌ తీసుకురావటం ఎవరూ మరిచిపోరు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ఆనాడు చెవికెక్కలేదు. ఆర్డినెన్స్‌ మురిగి పోయిన రెండుసార్లూ దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ తిరిగి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. రాజ్యసభలోగండం గడిచేలా లేదని గ్రహించాక ఇక దాని జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. అటుపై సాగు చట్టాల విషయంలోనూ రైతులనుంచి ఇలాంటి పరాభవమే ఎదురయ్యాక వాటినీ ఉపసంహరించుకున్నారు. ఐపీసీ, సాక్ష్యాధారాల చట్టం, సీఆర్‌పీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల తాలూకు బిల్లులపైకూడా సంబంధిత వర్గాలను సరిగా సంప్రదించలేదు. ఎన్డీయే ఏలుబడి మొదలయ్యాక చోటుచేసుకున్న వేర్వేరు ఉదంతాల పర్యవసానంగా ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదాస్పద చర్యకు కేంద్రం ఎందుకు సిద్ధపడిందో తెలియదు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీ(యూ) నేత, కేంద్రమంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అంటున్నారు. ఇది పారదర్శకత తీసుకొస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. మంచిదే. మరి ఆ వర్గంతో సంప్రదింపులు జరిగిందెక్కడ? ముస్లిం సమాజానికున్న అభ్యంతరాల సంగతలా వుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సైతం ఇది ఎసరు పెడుతోంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌ ప్రకారం భూమి రాష్ట్రాల జాబితాలోనిది.వక్ఫ్‌ ఆస్తిపై కేంద్ర పెత్తనాన్ని అనుమతించటంద్వారా దాన్ని కాస్తా తాజా బిల్లు నీరుగారుస్తోంది. కనుకముస్లిం సమాజంతో మాత్రమేకాదు…రాష్ట్రాలతో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదా? హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తెచ్చారని లోక్‌సభలో విపక్షాలు చేసిన విమర్శలు కాదని చెప్పటానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. తన చర్య వెనక సదుద్దేశం ఉందనుకున్నప్పుడూ, బిల్లుపై ఉన్నవన్నీ అపోహలే అని భావించి నప్పుడూ తగిన సమయం తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చించటానికేమైంది? ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే హడావిడిగా బిల్లు తీసుకొచ్చి వుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాదిరి ఎత్తుగడలను జనం ఏవగించు కున్నారని బీజేపీకి అర్థమయ్యే వుండాలి.సవరణ బిల్లు ద్వారా తీసుకొచ్చిన 44 సవరణల పర్యవసానంగా వక్ఫ్‌ బోర్డుల అధికారాలకు కత్తెరపడుతుందని, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కనబడుతూనేవుంది. అరుదైన సంద ర్భాల్లో తప్ప కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగానిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఫలానా ప్రార్థనాస్థలం శతాబ్దాలక్రితం తమదేనంటూ ఆందోళనలు చేయటం, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం అక్కడక్కడ కనబడుతూనేవుంది. ఇంతకాలం వక్ఫ్‌ ట్రిబ్యున ళ్లకు ఉండే అధికారం కాస్తా కలెక్టర్లకు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించటం, ఆస్తిని విరాళంగా ఇవ్వటంపై ఆంక్షలు సంశయం కలిగించేవే. మతపరమైన, ధార్మికపరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించటానికి ఏర్పడిన బోర్డుల్లో వేరే మత విశ్వాసాలున్నవారిని నియమించటం ఏరకంగా చూసినా సరికాదన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అసలు ఒకసారి బోర్డు దేన్నయినా వక్ఫ్‌ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని మార్చటం అసాధ్యమన్న ప్రచారం కూడా తప్పు. ఫలానా ఆస్తి బోర్డుదనుకుంటే సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి వారి వాదనలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత చట్టంలోని సెక్షన్‌40 చెబుతోంది.అటు తర్వాత వక్ఫ్‌ ట్రిబ్యునల్‌దే తుది నిర్ణయం. పైగా విరాళమిచ్చిన దాత కచ్చితంగా ఇస్లాంను పాటించే వ్యక్తే అయివుండాలని, దానంగా వచ్చే ఆస్తి కుటుంబవారసత్వ ఆస్తి కాకూడదని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పటికే ఇన్ని కట్టుదిట్టమైన నిబంధనలుండగా అందుకు భిన్నంగా ప్రచారం చేయటం సబబేనా? ఈ పరిస్థితుల్లో బిల్లు చట్టమైతే వక్ఫ్‌ ఆస్తుల చుట్టూ వివాదాలు ముసురుకుంటాయనుకునే అవకాశం లేదా? సంకీర్ణంలోని జేడీ(యూ), ఎల్జేపీలు బిల్లుకు మద్దతు పలకగా సభలో టీడీపీ సంకటస్థితిలో పడిన వైనం స్పష్టంగా కనబడింది. ఆ బిల్లుకు మద్దతిస్తుందట…కానీ జేపీసీకి ‘పంపితే’ వ్యతిరే కించబోదట! ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చిన బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా సజీవంగా ఉందన్నమాట! టీడీపీది చిత్రమైన వాదన. అలా పంపనట్టయితే వక్ఫ్‌ సవరణ బిల్లు ఆమోదించబోమనిచెప్పడానికి నోరెందుకు రాలేదు? ఒకపక్క బిల్లు చట్టమైతే పారదర్శకత ఏర్పడుతుందన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూనే తమ సెక్యులర్‌ వేషానికి భంగం కలగకుండా ఆడిన ఈ డ్రామా రక్తి కట్టలేదు. జాతీయ మీడియా దీన్ని గమనించింది. మొత్తానికి సవరణ బిల్లు జేపీసీకి వెళ్లటం శుభ పరిణామం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా పాటించటం ఉత్తమం..

Join WhatsApp

Join Now