సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాను అన్ని రంగాలలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిల్పడానికి ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ముందుగా జిల్లా ప్రజలకు మంత్రి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగధనుల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్రం (హైదరాబాద్ స్టేట్) ఏర్పడిందన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలపడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధానికి చేరువగా ఉన్న సంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోని అగ్రగామిగా అన్ని రంగాలలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం పని చేస్తుందని ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, ఉచిత గృహ విద్యుత్తు, ఉచిత బస్సు ప్రయాణం, లాంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేపట్టి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి డిఆర్ఓ పద్మజరాణి, సంగారెడ్డి జిల్లా గ్రంథాయల సంస్థ చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎంతో మంది త్యాగధనుల ఫలితమే నేటి ప్రజాపాలన దినోత్సవం: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
Published On: September 17, 2025 3:31 pm