సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం అని, శాంతి భద్రతలలో పోలీస్ కీలకం అని, పోలీసు ధైర్య సాహసాలకు ప్రజలు అండగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. మంగళవారం పోలీసు అమరుల త్యాగాన్ని స్మరించుకుంటూ సంగారెడ్డి పట్టణంలోని పేరేడు గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అంతరం కలెక్టర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ, వారి కుటుంబ సభ్యులతో వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాల సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా (పోలీస్ ఫ్లాగ్ డే)గా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సంగారెడ్డి పోలీస్ అంటేనే ధైర్యానికి చిరునామన్నారు. విధి నిర్వహణలో తమ విలువైన ప్రాణాలను ప్రజల కోసం త్యాగం చేశారని కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు ధైర్య సాహసాలే ప్రధానమన్నారు. ప్రజలందరూ నిర్భయంగా ఏ విధమైన విఘాతాలు కలగకుండా నివసించడంలో పోలీసుల ప్రధాన పాత్ర ఉందన్నారు. దేశవ్యాప్తంగా సంఘవిద్రోహం శక్తుల కారణంగా విధి నిర్వహణలో ఇప్పటివరకు 191 మంది పోలీసులు జవానులు అధికారులు అమరులు కాగా సంగారెడ్డి జిల్లాలో ఐదుగురు అమరులైనట్లు కలెక్టర్ తెలిపారు. వీరమరణం పొందిన వారి ప్రాణత్యాగాలను స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో సంగారెడ్డి పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు శాంతిభద్రతల పరిరక్షణ పరంగా జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితిలలోనైనా పోలీసు శాఖ ఎదురు నిలబడి, పోరాడటం జరుగుతుందని, అలాంటి పోలీసుల సేవలు మనందరి మదిలో చిరస్మరణీయం అన్నారు. గత జూన్ నెలలో జరిగిన సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శిధిలాల క్రింద చిక్కుకు పోయిన మృతదేహాలను వెలికి తీసి, తమ ధైర్య సహసాలను చాటుకున్నారని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర మరువలేనిదని తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబ సభ్యులకు స్మరించుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో 1959లో జరిగిన చైనా దళాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది వీరుల స్మారకార్థంగా ఈ రోజును జరుపుకోవడం మనందరి బాధ్యత అని వారి ధైర్యసాహసాలు, దేశభక్తి భావితరాలకు ఎంతో ఆదర్శమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో మన జవాన్లు చేసిన, చేస్తున్న కృషి వెలకట్టలేనిదని తెలిపారు. వారి నిస్వార్థ సేవ మరియు త్యాగాలు జిల్లా పోలీసులకు నిత్య స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన అన్నారు. అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా నేటి నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన “జాతీయ ఐక్యత దినోత్సవం” అక్టోబర్ 31వ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు.ఎస్పీ. రఘునందన్ రావు, శ్రీనివాస రావు, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, పటాన్ చెర్వు డీఎస్పీ ప్రభాకర్, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఏఆర్. డీఎస్పీ నరేందర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ. కళ్యాణి, యస్.బి. ఇన్స్పెక్టర్స్ కిరణ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, జిల్లా ఇన్స్పెక్టర్స్, ఆర్.ఐ.లు రామరావ్, పరేడ్ కమాండర్ – రాజశేఖర్ రెడ్డి, పరేడ్ కమాండర్ డానియెల్అ, మరవీరుల కుటుంబ సభ్యులు హాజరై నివాళులు అర్పించారు.
పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: October 21, 2025 5:14 pm