సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్‌లో గల మహిళా ప్రాంగణం సమీపంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం సందర్శించి, నిర్వహణ, సేవల నాణ్యతను పరిశీలించారు. డిఆర్డిఏ జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఈ బంక్‌ను మహిళలే స్వయంగా నిర్వహిస్తుండడం చాలా గర్వకారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మహిళలు కోటీశ్వరులుగా మారడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళల చేతిలో పెట్రోల్ బంక్ నిర్వహణ అన్నది మహిళా సాధికారతకు ఒక మైలురాయి అన్నారు. మహిళలు ఇప్పుడు ఉద్యోగాలకే పరిమితమయ్యే స్థాయిలో కాకుండా ఉద్యోగాలను సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. మహిళల చేతుల్లో ఉన్న ఈ పెట్రోల్ బంకు ఒక ఆదర్శంగా నిలవాలని అన్నారు. పెట్రోల్ బంక్ లో నిర్వహణ సంబంధిత వివిధ అంశాలను పరిశీలించారు. ముఖ్యంగా స్టాక్ రిజిస్టర్, రోజువారి అమ్మకాలు, యూపీఏ ట్రాన్సాక్షన్ వివరాలను పరిశీలించి, ఖచ్చితమైన లెక్కలు ఉండాలని సూచించారు. అలాగే, వినియోగదారులకు అనుకూలంగా స్టాక్ బోర్డు, సిటిజన్ చార్ట్, అత్యవసర నెంబర్లు స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. అమ్మకాలు పెంచుకునే విధంగా ప్రణాళికా బద్దంగా ముందుకెళ్లాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని హితవు పలికిన కలెక్టర్, ఖాళీ బాటిల్స్ లలో పెట్రోలు అమ్మకూడదని, ఇది చట్ట విరుద్ధం అని, లీగల్ మెట్రాలజీ శాఖ తరచుగా తనిఖీలు చేసి నాణ్యత, పరిమాణాలను నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు. అలాగే బంక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మౌలిక అవసరాలను కల్పించాలన్నారు. ఈ సందర్భముగా కలెక్టర్, పెట్రోలు పోసుకోవడానికి వచ్చిన వినియోగదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులు మహిళలు నడుపుతున్న బంక్‌లో సురక్షితంగా, వేగంగా సేవలు అందుతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్డిఏ సూర్యారావు, ఏపిఎం లు సంబంధిత అధికారులు, జిల్లా మహిళా సమైక్య ప్రతినిధులు, బంక్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
మహిళల చేతుల్లో ఉన్న ఈ పెట్రోల్ బంకు ఒక ఆదర్శంగా నిలవాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Published On: August 5, 2025 7:04 pm