దక్షిణ అయోధ్యగా విరజిల్లుతున్న భద్రాచలం పట్టణంలో జాతీయ రహదారులు దారుణంగా ధ్వంసం అయిపోతున్నాయని, పాలకుల నిర్లక్ష్యంతో పుణ్యక్షేత్రం ప్రమాదాలకు నిలయంగా మారిందని సీపీఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి ఆరోపించారు. ఈ సమస్యపై సీపీఐఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
బుధవారం సీపీఐఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల మరమ్మతులకు గురై, ప్రమాదాలకు కారణమవుతున్న చర్ల రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ, చర్ల, వెంకటాపురం మండలాల నుండి వచ్చే ఇసుక లారీల రద్దీతో భద్రాచలం నుండి వెంకటాపురం వరకు జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసం అయిపోయిందని తెలిపారు. ముఖ్యంగా భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుండి నన్నపనేని మోహన్ హైస్కూల్ వరకు వేసిన తారు రోడ్డు విధ్వంసంగా మారి ప్రమాదాలకు దారితీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రామయ్య దర్శనానికి వచ్చే యాత్రికులు పర్ణశాలకు వెళ్ళడానికి ఈ రోడ్డుపై ప్రయాణించడం దుర్భరంగా మారిందని, ఒక్కసారి ఈ రహదారిపై ప్రయాణించిన యాత్రికులు మరోసారి భద్రాచలం పేరు వింటేనే భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని నర్సారెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారుల మరమ్మతులు చేపట్టాలని సీపీఐఎం ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా దశలవారీగా ఉద్యమాలు చేస్తున్నా పాలకుల నుంచి స్పందన లేదని ఆయన విమర్శించారు.
సీపీఐఎం జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకత్వం పలుమార్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు వినతిపత్రాలు అందించారని నర్సారెడ్డి గుర్తు చేశారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయని, ఇప్పటివరకు రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం చొరవ చూపలేదని ఆయన ఆరోపించారు. ఇటీవల జరిగిన అత్యధిక రోడ్డు ప్రమాదాలు ఈ రహదారిపైనే జరుగుతున్నా పాలకులు స్పందించకపోవడం దుర్మార్గమని నర్సారెడ్డి అన్నారు.
యుద్ధ ప్రాతిపదికన భద్రాచలం పట్టణంలోని జాతీయ రహదారి మరమ్మతులు చేపట్టకపోతే సీపీఐఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కమిటీ సభ్యులు నకిరేకంటి నాగరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు రవీందర్, పార్టీ నాయకులు అంజి, భూషణం, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.











