ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కామారెడ్డి జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 'అరైవ్ అలైవ్' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు ఏప్రిల్ 13 నుండి 18 వరకు కొనసాగనున్నాయి.
పోలీస్, రవాణా, ఆర్&బి, విద్య, వైద్య శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగవాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పోస్టర్ ఆవిష్కరణతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం కలిగించడం అత్యంత అవసరమని, కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాదచారులు, వాహనదారులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు రూపొందించినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా రహదారి భద్రతా నియమాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, తద్వారా ప్రమాదాల సంఖ్యను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేసి, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.








