జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో మైనర్లకు వాహనాలు ఇవ్వడంపై తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
కొడకండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సదస్సుకు సర్పంచ్ దూలం మమత సతీష్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అనిల్ బాబు మాట్లాడుతూ, మైనర్లకు ద్విచక్ర, ఇతర వాహనాలను ఇవ్వరాదని, వారి భద్రత విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్థానిక ఎస్.ఐ రాజు మాట్లాడుతూ, 18 ఏళ్ల లోపు వారికి వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించని వారిపై కఠిన చర్యలు, జరిమానాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
సర్పంచ్ దూలం మమత సతీష్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామాల్లో మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లు గుర్తిస్తే, ఆ వాహనాలను నెల రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచడంతో పాటు రూ. 10,000 జరిమానా విధించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ తీర్మానం అమలు చేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ అవగాహన సదస్సులో ఎం.పి.డి.ఓ నాగశేషాద్రి సూరి, కార్యదర్శి ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఎం.డి. షన్న, వార్డ్ సభ్యులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత కమిటీని కూడా ఎన్నుకున్నారు.











