సంగారెడ్డి, జూలై 17
సంగారెడ్డి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించి, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను కల్పించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు గల కారణాలను పరిశీలించి, శాశ్వత పరిష్కార చర్యలపై చర్చించారు.
సంగారెడ్డి పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించి, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను కల్పించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సంగారెడ్డి చౌరస్తా నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు, బైపాస్ రోడ్డు, సాయిబాబా కమాన్, కల్వకుంట రోడ్డు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ట్రాఫిక్ సమస్యలకు గల కారణాలను పరిశీలించినట్లు తెలిపారు.
ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు చేసి, వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణాలను వెనక్కి తరలించడం లేదా వారికి ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించడం, ఆటోరిక్షాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయడం, అవసరమైన చోట బొల్లార్డ్స్ ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. పాదాచారులు సురక్షితంగా ఫుట్‌పాత్‌లపై నడిచేలా ఫుట్‌పాత్ ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి సంగారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత, వైస్ చైర్మన్ షైక్ షఫీ, ఆర్డీఓ రాఘవేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ జయరాం, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, టౌన్, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఎస్బీ ఇన్స్పెక్టర్, ఇతర పోలీసు అధికారులు, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.












