సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనవరి 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ముందస్తు సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుమిది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం–2019లోని సవరించిన సెక్షన్ 195–ఎ ప్రకారం వార్డువారీ ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12 న తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి, వాటిని ‘టి–పోల్’లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫోటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డులలోని పోలింగ్ స్టేషన్ల వద్ద స్పష్టంగా ప్రచురించాలని తెలిపారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమైన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లను ముందస్తుగా చేపట్టాలని కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పలు అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా, ఆయా విషయాలపై కమిషనర్ తగిన సూచనలు, మార్గదర్శకాలను అందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుండి అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగపు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్
Published On: January 7, 2026 6:47 pm