రాష్ట్రంలో రాబోయే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వేడి, ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఈ మూడు నెలల కాలంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలున్నాయని ఐఎండీ తన సీజనల్ అవుట్‌లుక్‌లో వెల్లడించింది.
ఐఎండీ ప్రకారం, ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు సాధారణం కంటే ఎక్కువ రోజులు ప్రభావం చూపనున్నాయి. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా. ముఖ్యంగా ఏప్రిల్‌లో కోస్తా జిల్లాల్లో వడగాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది.
అయితే, ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది కొంత ఉపశమనాన్ని కలిగించవచ్చు.
పెరుగుతున్న వేడి వాతావరణం వ్యవసాయ రంగంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వరి, పెసర, మినుము, కూరగాయల వంటి పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉందని, అలాగే మామిడి, అరటి వంటి పండ్ల తోటల్లో పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. పంట నష్టాన్ని నివారించడానికి, నేలలో తగిన తేమ ఉండేలా తరచుగా నీటి తడులు అందించాలని, వేడిని తట్టుకోవడానికి పొటాషియం లేదా ఇతర యాంటీ ట్రాన్స్పరెంట్లను ఆకులపై పిచికారీ చేయాలని రైతులకు సూచించింది.
మంగళవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గినప్పటికీ, నంద్యాల జిల్లా దొర్నిపాడులో అత్యధికంగా 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు, పలు మండలాల్లో వడగాలులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపారు.











