ప్రజల సమస్యల పరిష్కారమే టీజేయు ధ్యేయం..
జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతర పోరాటం..
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): వివక్షత ఎక్కడ ఉంటుందో అక్కడ టీజేయు ఉంటుందని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్‌రావు స్పష్టం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో టీజేయు ఆధ్వర్యంలో జరిగిన 14వ రాష్ట్ర వార్షికోత్సవ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు కేవలం వార్తలు రాయడం కాదు, సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా ఉండాలని చెప్పారు. కొన్ని దశాబ్దాల క్రితం నక్సలైట్ల లేఖలు మీడియాకు అందించేవారని యూనియన్ నాయకులు’ అని చెప్పుకున్నా, ప్రజల కోసమే పని చేసే నిజమైన జర్నలిస్టులు టీజేయులోనే ఉన్నారని అన్నారు. టీజేయు తెలంగాణ కోసం మాత్రమే కాదు, ప్రజల కోసం పనిచేసే ఏకైక యూనియన్ అని తెలిపారు. కెసిఆర్ నియంత పాలనలో జర్నలిస్టులు ఎదుర్కొన్న ఇబ్బందులను నిర్లక్ష్యం చేయలేదని, సత్యానికి నిలబడి ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడిన టీజేయు గర్వించదగ్గ స్థాయికి చేరిందని అన్నారు. గద్దె ఎవరిదైనా పెద్ద విషయం కాదు, కానీ కేసీఆర్‌ను గద్దె దింపగలిగామన్నదే గర్వకారణం అని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం టీజేయు కృషి చేస్తున్నదని ఆయన వివరించారు. ఇళ్ల నిర్మాణం, హెల్త్ కార్డులు, ఉచిత విద్య, పెన్షన్ వంటి సదుపాయాలపై ప్రభుత్వం వద్ద విన్నపాలు చేశామని, ప్రతి జర్నలిస్టు గౌరవప్రదమైన జీవితం గడపడం మా ధ్యేయం అని అన్నారు. అనంతరం మాస్టర్ జీ మాట్లాడుతూ.. జర్నలిస్టులపై వివక్షతను పూర్తిగా తొలగించాలని, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న జర్నలిస్టులకు తగిన న్యాయం జరగాలని అన్నారు. తాడిత, పీడిత జనాల పక్షాన నిలబడి నిజమైన వార్తలు రాయడం ద్వారానే అంబేద్కర్ కలలుగన్న సమానత్వ రాజ్యం సాధ్యం అవుతుందని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్ మాట్లాడుతూ.. “నిజం రాసే జర్నలిస్టులు ఎల్లప్పుడూ కష్టాలను ఎదుర్కొంటారని, షోయబ్ ఉల్లా ఖాన్ వంటి నిజాయితీ గల జర్నలిస్టులు సత్యం చెప్పినందుకు ప్రాణాలు అర్పించారని తెలిపారు. రజాకార్లు ఒకే మతానికి చెందినవారు కాదు — అన్ని వర్గాల్లో ఉన్నారని అన్నారు. ఐఎఫ్‌డబ్ల్యూజే ఉపాధ్యక్షుడు డాక్టర్ పెద్దాపురం నరసింహ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద జర్నలిస్టు యూనియన్ ఐఎఫ్‌డబ్ల్యూజే. ప్రపంచ వ్యాప్తంగా మన యూనియన్ ప్రతిష్టను నిలబెట్టుకుందని, టీజేయు చేసే ప్రతి న్యాయమైన పోరాటానికి ఐఎఫ్‌డబ్ల్యూజే పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి మాట్లాడుతూ.. “టీజేయు అంటేనే నిబద్ధతగల యూనియన్ అని, ఇందులో పని చేయడం గర్వకారణం అని, ఎవరైనా జర్నలిస్టుకు కష్టం వచ్చినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు వెంటనే స్పందించడం ఆయన నైజం అన్నారు. ఇతర యూనియన్లలో లేని స్వేచ్ఛ టీజేయులో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా డా. భరత్‌కుమార్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి దశరథ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పలువురు జర్నలిస్టులకు సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌డబ్ల్యూజే కార్యదర్శి డా.భరత్‌కుమార్ శర్మ, రాష్ట్ర కార్యదర్శులు సిహెచ్ శ్రీనివాస్, సంగారెడ్డి ఇంచార్జ్ బాపురావు, దశరథ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లాధ్యక్షులు వల్లపు శ్రీనివాస్, కృష్ణమూర్తి, రామయ్య, షానూర్ బాబా, ప్రసాద్, సుదర్శన్, సిద్ధల రవి, రమేష్ గౌడ్, గండ్ర నరేందర్, ఫసియోద్దీన్, గుడాల శేఖర్, శ్రీకాంత్, సాగర్, శ్రీనివాస్, బైరి ప్రభాకర్, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు పాల్గొన్నారు.