ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఖరీఫ్ 2025-26 వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. ఖరీఫ్ 2025-26 – ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణ ప్రక్రియపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ సజావుగా జరగాలని మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సంగారెడ్డి జిల్లా నుండి కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మాధురి, జిల్లా పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ముందుగా హార్వెస్టర్ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలు లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేయరాదని, ప్రతి మండలం, నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులు, సూపర్వైజర్లు నియమించాలని సూచించారు. హమాలీల కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, వాతావరణ శాఖ రిపోర్టులను కేంద్ర నిర్వాహకులకు తెలియజేయాలని అన్నారు. జిల్లాలో వరి కొనుగోలు కంట్రోల్ రూమ్ , టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇతర జిల్లాల నుండి ధాన్యం రాకుండా ఇంటర్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓపీఎంఎస్ వ్యవస్థలో మిల్లుల ట్యాగింగ్ పనులు పూర్తి చేయాలని, పిపిసి సెంటర్ల నుండి నిర్ధారిత రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో తాగునీటి వసతులతో పాటు విద్యుత్ సౌకర్యం రైతుల విశ్రాంతి కోసం షెడ్ల ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు సరియైన తేమ శాతం ఉండేలా చూడడంతో పాటు ధాన్యం తూర్పార బట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తార్పాలిన్లు, ఆటోమేటిక్ వరి శుభ్రపరచే యంత్రాలు, పెద్ద/చిన్న వరి క్లీనర్లు, ధాన్య కొలమాన పరికరాలు, తేమ కొలిచే మీటర్లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, పొట్టు తొలగించే యంత్రాలు, ఫీల్డ్ తూకం యంత్రాలు, మొబైల్ ఎండబెట్టే యంత్రాలు వంటి మౌలిక వసతులు కేంద్రాలలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు. ఈ సమావేశంలో డి.ఎం సివిల్ సప్లై అధికారి అంబదాస్ రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల అధికారి బాల సరోజ, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్, పి.డి డిఆర్డిఏ జ్యోతి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు దీపిక, ప్రతిభ, తూనికలు కొలతల శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment