సంగారెడ్డి, సెప్టెంబర్ 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, విద్యుత్ శాఖ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని, సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర సెక్రటరీ జనరల్ బిసి. రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో సంగారెడ్డి, మెదక్ జిల్లాల పవర్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సెక్రటరీ జనరల్ పి.బిసి.రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి సభాధ్యక్షుడిగా మనోరంజన్ రెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డిస్కమ్ కార్యవర్గ సభ్యులు పి.శ్రీనివాసులు, జే.నరేష్ కుమార్, చంద్రశేఖర్, తాజుద్దీన్ బాబా, ఎస్.రాజా, టీఎస్. దుర్గాప్రసాద్, ఆర్.శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ సమక్షంలో సంగారెడ్డి, మెదక్ జిల్లాల కొత్త కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన వారికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బిసి.రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించడం, అలాగే గృహ వినియోగదారులు, చిన్న వ్యాపారవేత్తలకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. అలాగే ప్రజలతో మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ విద్యుత్ శాఖ ప్రతిష్టను పెంపొందించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించి, జిల్లాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. విద్యుత్ శాఖలో ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు, వసతులు, సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని బిసి.రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎస్ఈ శ్రీనాథ్, సంగారెడ్డి డివిజనల్ ఇంజనీర్ లక్ష్మణ్, పటాన్ చెరు డివిజనల్ ఇంజనీర్ భాస్కర్ రావు, జహీరాబాద్ డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, జోగిపేట డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్, జిల్లాల నలుమూలల నుండి పవర్ డిప్లమా ఇంజనీర్లు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
*నూతన కార్యవర్గం ఎన్నిక*
తెలంగాణ పవర్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ జాదావత్, కార్యదర్శి సిద్దరాజు, కోశాధికారి రాజేశ్వర్ స్వామి, కార్యనిర్వాహక అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, అశోక్ కుమార్ లు ఎన్నికయ్యారు.