బీసీ కులాల పునర్‌వ్యవస్థీకరణ ..!!

*బీసీ కులాల పునర్‌వ్యవస్థీకరణ ..!!*

సర్వే నివేదిక వచ్చాక ప్రతిపాదనలు రూపొందిస్తాం

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపైనా అభ్యంతరాలు వస్తున్నాయి

ఇప్పటివరకు 1224 విజ్ఞప్తులు

నేడు కూడా బహిరంగ విచారణ

బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 26: రాష్ట్రంలోని బీసీ ఏ, బీ, సీ, డీ, ఈ లోని కులాలను పునర్‌వ్యవస్థీకరించాలని అనేక కుల సంఘా లు విజ్ఞప్తి చేస్తున్నాయని, ఇంటింటి సర్వే నివేదిక వచ్చిన తర్వాత ఆ దిశగా కృషి చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ గోపిశెట్టి నిరంజన్‌ వెల్లడించారు. అదీగాక ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లతో బీసీ వర్గాలకు నష్టం వాటిల్లుతున్నదనే ఆధారాలను పలు సంఘాలు చూపుతున్నాయని, దీనిపైనా సానుకూల దృక్పథంతో దృష్టి సారిస్తామని తెలిపారు. ఉమ్మడి పదిజిల్లాల్లో తెలంగాణ బీసీ కమిషన్‌ చేపట్టిన బహిరంగ విచారణ ఇటీవలే ముగియగా, దానికి కొనసాగింపుగా ఖైరతాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో రాష్ట్రస్థాయి బహిరంగ విచారణను సోమవారం నిర్వహించారు.

ప్రజలు, వివిధ కుల సంఘాల నుంచి దరఖాస్తులను అభ్యర్థనలను స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ మాట్లాడుతూ ఒక్కరోజే దాదాపు 58 వినతులు, సలహాలు, సూచనలు అఫిడవిట్‌ రూపం లో కమిషన్‌కి అందాయని వెల్లడించారు. బహిరంగ విచారణలో మొత్తం గా 1224 వినతులను స్వీకరించామని తెలిపారు. బీసీ జాబితాలో నుంచి తొలగించిన 26కులాలను తిరిగి చేర్చాలని కోరారని తెలిపారు. ఇంకా వినతులను సమర్పించాలనుకున్న వారు మంగళవారం కమిషన్‌లో జరిగే బహిరంగ విచారణలో పాల్గొనాలని సూచించారు. సమావేశంలో చైర్మన్‌ నిరంజన్‌తోపాటు, సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌ , బాలలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, స్పెషల్‌ ఆఫీసర్‌ సతీశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now