సంగారెడ్డి, జూలై 21
మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబం ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించి, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం తెల్లవారుజామున సుమారు 04:15 గంటలకు, కల్హేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచేపల్లి గ్రామ సమీపంలోని ఎస్.ఎస్. ఫంక్షన్ హాల్ వద్ద జాతీయ రహదారి-161 పై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, రోడ్డు పరిస్థితులు, వాహనం వేగం తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను సమగ్రంగా విచారించి, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లా, దెగ్లూర్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు MH06AN7306 నంబర్ గల స్కార్పియో వాహనంలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా, డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో డివైడర్ను ఢీకొని, హైవే రోడ్డును దాటి సర్వీస్ రోడ్డుపైకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో మహమ్మద్ షామీన్ బేగం (50), మహమ్మద్ అనాబియా తస్కీం (4) ఘటన స్థలంలోనే మృతి చెందగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మహమ్మద్ నదీమ్ (32) మార్గమధ్యలో మృతి చెందారు. తీవ్ర గాయాలపాలై మహమ్మద్ నవీద్ (28) సంగారెడ్డిలోని వెల్నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ ఘటనపై కల్హేర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
వాహనదారులు అధిక వేగంతో వాహనాలను నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పరిమిత వేగంలో వాహనాలను నడపాలని అన్నారు.












