బట్టీ చదువులకు స్వస్తి.. ప్రయోగాలతోనే అసలైన విద్య

సంగారెడ్డి, అక్టోబర్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): విజన్ గ్రూప్స్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వినోద్ ఆధ్వర్యంలో బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులు కాగ్నోస్పేస్ నూతన విద్యా విధానానికి సంబంధించిన ల్యాబ్ ను సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని విజన్ స్కూల్ లో ఘనంగా ప్రారంభించారు. పుస్తకాల్లోని పాఠాలను బట్టీ పట్టే విధానానికి కాలం చెల్లింది. విద్యార్థులు ప్రతి అంశాన్ని స్వయంగా ప్రయోగాలు చేస్తూ, అనుభవం ద్వారా నేర్చుకునే సరికొత్త పద్ధతికి బిట్స్-పిలానీ పూర్వ విద్యార్థులు శ్రీకారం చుట్టారు. ‘కాగ్నోస్పేస్’ పేరుతో వీరు రూపొందించిన వినూత్న విద్యావిధానం దేశవ్యాప్తంగా వందకు పైగా పాఠశాలల్లో విజయవంతంగా అమలవుతూ సత్ఫలితాలనిస్తోంది. కాగ్నోస్పేస్ అనేది కేవలం చదువు చెప్పే విధానం కాదు. విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను, ఆలోచనా శక్తిని వెలికితీసే ఒక వేదిక. విద్యార్థులను చదువులో భాగస్వాములను చేస్తూ, వారిలో నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో సైన్స్, మ్యాథ్స్, రోబోటిక్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, (ఎస్టిఇఎమ్), లైఫ్ స్కిల్స్ వంటి కీలక కఠినమైన సబ్జెక్టులను కూడా ఆటపాటలతో, ప్రయోగాల రూపంలో నేర్పిస్తారు. అత్యాధునిక కాగ్నోస్పేస్ ప్రత్యేకత ‘స్కిల్ ల్యాబ్’ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో విద్యార్థులు బృందాలుగా కూర్చుని పని చేసేందుకు వీలుగా, తమ ఆలోచనలను ధైర్యంగా పంచుకోవడానికి ఒక వేదిక, ఆగ్మెంటెడ్ రియాలిటీ/వర్చువల్ రియాలిటీ పరికరాలు, వస్తువులను స్వయంగా తయారు చేయడానికి 3డి ప్రింటర్లు, 300కు పైగా ప్రయోగాల కిట్లు ఉంటాయి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా, ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాలకు అనుగుణంగా 1 నుంచి 9వ తరగతి వరకు 600కు పైగా కృత్యాలతో (యాక్టివిటీస్) సిలబస్‌ను రూపొందించారు. కంప్యూటర్ పాఠాలు, పుస్తకాలు, ప్రయోగ పరికరాలు అన్నింటినీతో బోధన సాగిస్తారు. దీనివల్ల విద్యార్థులకు ప్రతి విషయంపై స్పష్టమైన, లోతైన అవగాహన కలుగుతుంది. ఈ విధానాన్ని విజన్ స్కూల్ లో ప్రారంభించినందుకు యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. తమ అనుభవాన్ని పంచుకుంటూ ‘కాగ్నోస్పేస్ సెషన్లలో మా పిల్లలు ఎంతో ఉత్సాహంగా, చురుకుగా పాల్గొంటున్నారని అన్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తోటివారితో కలిసి పని చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన కనిపిస్తోంది. ఈ మార్పు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. కాగ్నోస్పేస్ కేవలం ల్యాబ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా, పాఠశాలలకు నిరంతర సహకారం అందిస్తూ, విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈప్రారంభోత్సవంలో ఇష్టా గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ కార్తీ, విజన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వినోద్, ఇష్టా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. రవికిరణ్ రెడ్డి, విజన్ స్కూల్ ప్రిన్సిపాల్ షేక్ ఇబ్రహీం, బిట్స్ పిలాని పూర్వ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment