సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా శనివారం సంగారెడ్డిలోని తార డిగ్రీ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి లలితాకుమారి మాట్లాడుతూ.. “యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ మిషన్ పరివర్తన’ కార్యక్రమం జరుగుతోంది. ఎవరైనా మత్తు పదార్థాలను సేవిస్తుంటే లేదా విక్రయిస్తుంటే 14446 లేదా 1098 హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం అందించవచ్చని తెలిపారు. అలాగే బేటీ బచావో.. బేటీ పడావో వంటి కార్యక్రమాలు, యువతకు కౌన్సిలింగ్ కూడా జరుగుతోందని వివరించారు. పట్టణ సీఐ రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. మత్తు పదార్థాలు వినియోగించడం, విక్రయించడం చట్టపరమైన నేరం. కఠిన కారాగార శిక్షలు తప్పవు అని హెచ్చరించారు. తదనంతరం అధికారులు మాదకద్రవ్యాల దుర్వినియోగంపై పోస్టర్లు ఆవిష్కరించారు. విద్యార్థులతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ప్రొహిబిషన్ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్, క్రైమ్ బ్రాంచ్ అధికారి రమేష్, తార డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జగదీశ్వర్, జిల్లా ఆరోగ్య, విద్య విస్తరణ అధికారి శ్రీనివాస్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.