నర్సాపూర్, సెప్టెంబర్ 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో తై బజార్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. రామయంపేటలో తై బజార్‌ను ఇప్పటికే రద్దు చేశారని, అదే విధంగా నర్సాపూర్‌లో కూడా తై బజార్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. తై బజార్ నిర్వాహకులు చిరు వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక చిన్న వ్యాపారులు, దుకాణదారులు తమ కుటుంబాల పోషణ కోసం కష్ట పడుతుంటే, తై బజార్ కారణంగా వారి ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. తై బజార్ రద్దు చేసి, స్థానిక వ్యాపారులకు న్యాయం చేసేలా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గుండం శంకర్, బీజేపీ నర్సాపూర్ పట్టణ అధ్యక్షుడు నీరుడి చంద్రయ్య, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శులు సంగసాని రాజు, బోర్ వెల్స్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో తై బజార్ రద్దు చేయాలంటూ బీజేపీ నాయకుల వినతి
Published On: September 16, 2025 8:39 pm