కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో భద్రతా చైతన్యం పెంపొందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, దొంగతనాల నివారణపై ప్రజలకు సూచనలు అందించారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, దొంగతనాలపై అప్రమత్తత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
సైబర్ మోసాల నివారణకు సంబంధించి, ఓటీపీలు, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు కాల్ చేయాలని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని, వారి టోల్ ఫ్రీ నంబర్ 872686094 ద్వారా సహాయం పొందవచ్చని వివరించారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల్లో పిల్లలు నీటి వనరుల వద్ద ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మానవ అక్రమ రవాణాపై కూడా ప్రత్యేక అవగాహన కల్పించారు.












