జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య అమీన్ పూర్ లోని ది నెస్ట్ వృద్ధాశ్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వృద్ధులకు అందుతున్న సౌకర్యాలు, వైద్య సేవలు, భోజనం వంటి అంశాలపై ఆమె ఆరా తీశారు.
జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు ఈ తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. వృద్ధాశ్రమంలోని గదులు, వంటగది, బాత్రూంలు, ఆవరణ మొత్తాన్ని ఆమె పరిశీలించి, వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి సకాలంలో వైద్య సేవలు అందించాలని వృద్ధాశ్రమ నిర్వాహకులకు సూచించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, న్యాయపరమైన సహాయం అవసరమైన వారికి ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందిస్తామని తెలిపారు. న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
న్యాయ సేవాధికార సంస్థ యొక్క టోల్ ఫ్రీ నంబర్ 15100 ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ తనిఖీలో వృద్ధాశ్రమ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.












