సంగారెడ్డి, జూలై 7
పంకజ్‌లో వరుసగా జరుగుతున్న ఇంటి జిల్లాతనాల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీఎస్ సంగారెడ్డి, గుమ్మడిదల పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఉన్న హౌస్ బ్రేకింగ్ నిందితుడు కోటపల్లి చంద్రి అలియాస్ శేఖర్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వెండి ఆభరణాలు, రూ.25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న ఇంటి దొంగతనాల నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా, సీసీఎస్ సంగారెడ్డి, గుమ్మడిదల పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో 80 పాత కేసులు, 26 కొత్త కేసుల్లో నిందితుడైన అలవాటు హౌస్ బ్రేకింగ్ నిందితుడు కోటపల్లి చంద్రి అలియాస్ శేఖర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 22.5 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, రూ.25,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, నిందితుడు 2007 సంవత్సరం నుంచి రాత్రివేళల్లో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ ఇళ్లలో చొరబడి బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు దొంగిలించి, తెలిసిన వ్యక్తులకు విక్రయించడం లేదా తాకట్టు పెట్టడం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తూ, విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
నిందితుడిపై హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 80 పాత కేసులు (ఒక పోక్సో కేసు మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో), 26 కొత్త కేసులు నమోదై ఉన్నాయని, ఇప్పటివరకు అతడు 19 సార్లు జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లి, పలుమార్లు బెయిల్‌పై విడుదలయ్యాడని, 25 పైగా కేసుల్లో శిక్షలు కూడా అనుభవించినప్పటికీ, తన నేర ప్రవర్తనలో మార్పు లేకుండా ఇదే తరహా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చాడని పేర్కొన్నారు.
2024లో మేడిపల్లి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి చర్లపల్లి సెంట్రల్ జైలుకు పంపగా, సుమారు 14 నెలలు జైలులో ఉన్నాడు. అనంతరం 17.10.2025న బెయిల్‌పై విడుదలైనా మూడు రోజులకే తిరిగి ఇంటి దొంగతనాలు ప్రారంభించాడు.
నిందితుడి నేర ప్రవృత్తి: నిందితుడు ముందుగా ఒంటరిగా ఉన్న ఇళ్లు, తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లను గమనించి ఎంపిక చేసుకుంటాడు. ఇంట్లో లైట్, ఫ్యాన్, ఏసీ ఆన్‌లో ఉన్నాయా లేదా అన్నది పరిశీలించి, ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత వెనుక వైపు నుంచి ప్రవేశిస్తాడు. ఇంటి వెనుక భాగంలో పొదలు లేదా ఖాళీ ప్రదేశం ఉన్న ఇళ్లను లక్ష్యంగా ఎంచుకుని, చోరీ అనంతరం తప్పించుకోవడానికి వెనుక తలుపు తెరిచి ఉంచేవాడు. దొంగతనం చేసిన తర్వాత తెల్లవారుజాము వరకు పొదల్లో దాక్కొని, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేవాడు. గత ఎనిమిది నెలల కాలంలో నిందితుడు మొత్తం 26 ఇంటి దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది. వీటిలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో 3, హత్నూరా పోలీస్ స్టేషన్ పరిధిలో 1, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3, పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు నమోదయ్యాయి. అలాగే అబ్దుల్లాపూర్‌మెట్, ఐడీఏ బొల్లారం, వనస్థలిపురం, జీనోమ్ వ్యాలీ, శామీర్‌పేట్, కీసర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.












