నిజామాబాద్ జిల్లా పోలీసులు అంతరజిల్లా స్థాయిలో పనిచేస్తున్న ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో 64 ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ కాయిల్స్‌ను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 21వ తేదీన సాటాపూర్ బైపాస్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా మూడు మోటార్ సైకిళ్లపై వస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ట్రాన్స్ఫార్మర్లకు చెందిన రాగి కాయిల్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు మెదక్, బోధన్ ప్రాంతాలకు చెందినవారని, గత రెండేళ్లుగా ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని అంగీకరించారు.
నిందితులు నిజామాబాద్ జిల్లాలో 38, కామారెడ్డి జిల్లాలో 20, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 2 ట్రాన్స్ఫార్మర్లలో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన రాగి కాయిల్స్‌ను స్క్రాప్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో 80 కిలోల రాగి కాయిల్స్, మూడు మోటార్ సైకిళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అభినందించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.











