ఖాళీ ప్లాట్లను లక్ష్యంగా చేసుకుని, నకిలీ పత్రాలతో భూకబ్జాలకు పాల్పడుతున్న ఒక ముఠాను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు తేలింది.
నిజాంపేట్‌కు చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగికి చెందిన కీసర మండలంలోని రాంపల్లి గ్రామంలోని ప్లాట్‌ను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంది. యజమాని లేని సమయంలో నకిలీ లింక్ డాక్యుమెంట్లను సృష్టించి, ప్లాట్‌ను పలువురికి అమ్మినట్లు నకిలీ రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ మోసపూరిత విధానంలో డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నిందితులు మొదట ఒక నకిలీ యజమానిని సృష్టించి, ఆపై ప్లాట్‌ను పలు భాగాలుగా విభజించి వివిధ వ్యక్తులకు అమ్మినట్లు చూపించారు. చివరికి, ఈ ప్లాట్‌ను జంగాల శ్రీరామ్, అతని భార్య విజయలక్ష్మి పేర్ల మీదకు రిజిస్ట్రేషన్ మార్చారు. తక్కువ సమయంలో అధిక లాభాలు ఆర్జించాలనే దురుద్దేశంతో ఈ ముఠా ఈ కార్యకలాపాలకు పాల్పడినట్లు అంగీకరించింది.
పోలీసులు ఈ కేసులో కీలక నిందితులైన జంగాల శ్రీరామ్, గుబ్బల వెంకటేశ్వరరావు, బందెల్ల ప్రశాంత్, బందెల్ల ప్రభాకర్, పోన్నబోయిన బాలకృష్ణ, డాక్యుమెంట్ రైటర్ ఉదయ్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.











