మహిళల భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో మల్కాజిగిరి షీ టీమ్స్ వేధింపులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతున్నాయి. గత నెల రోజుల్లో (ఫిబ్రవరి 16 నుండి మార్చి 15 వరకు) చేపట్టిన ప్రత్యేక దాడుల్లో మొత్తం 181 మందిని అరెస్ట్ చేసినట్లు మల్కాజిగిరి డీసీపీ టి. ఉషారాణి తెలిపారు.
మహిళలు నిర్భయంగా తిరిగే వాతావరణం కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని డీసీపీ ఉషారాణి పేర్కొన్నారు. బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, విద్యాసంస్థల వద్ద మఫ్టీలో నిఘా పెట్టి పోకిరీలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కాలంలో మొత్తం 223 ఫిర్యాదులు అందాయని, అరెస్ట్ అయిన వారిలో 148 మంది మేజర్లు, 33 మంది మైనర్లు ఉన్నారని వెల్లడించారు.
వేధింపుల తీరును వివరిస్తూ, ఫోన్ కాల్స్ ద్వారా 57, సోషల్ మీడియా ద్వారా 53, ప్రత్యక్షంగా 113 ఘటనలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫిర్యాదుల తీవ్రతను బట్టి 8 క్రిమినల్ కేసులు, 57 పెట్టీ కేసులు నమోదు చేశారు. 122 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
షీ టీమ్స్ కీలక కేసులను కూడా ఛేదించాయి. ప్రేమ పేరుతో మోసం చేసి, గర్భస్రావాలకు గురిచేసి నగదుతో పరారైన నిందితుడిని, విద్యార్థినిని బెదిరించిన వ్యక్తిని, మహిళా ఉద్యోగులను వేధిస్తున్న ప్రైవేట్ కంపెనీ యజమానిని అరెస్ట్ చేశారు. మెట్రోలో మహిళల కోసం కేటాయించిన కోచ్లలో ప్రయాణించిన 6 మంది పురుషులకు జరిమానా విధించారు.
సామాజిక మార్పు కోసం 97 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సుమారు 14,715 మందికి చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలు వేధింపులను ఎదుర్కొంటే భయపడకుండా మల్కాజిగిరి షీ టీమ్ వాట్సాప్ నంబర్ 8712662111 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని డీసీపీ ఉషారాణి హామీ ఇచ్చారు.











