గాయని మంగ్లి (మంగళ)పై వస్తున్న ఆరోపణలను ఆమె సోదరుడు శివ చౌహన్ తీవ్రంగా ఖండించారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, తమ అక్క కేవలం ఆలయాలకు మాత్రమే వెళ్తుందని స్పష్టం చేశారు. మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.
తన సోదరిపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి శివ చౌహన్ మాట్లాడుతూ, తమ ఫొటోలను ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మధు రమావత్, హేమాకాంత్ రెడ్డిలు తీజ్ పండుగ సందర్భంగా మాట్లాడటానికి వచ్చారని, తమ అక్క తన నంబర్ ఇచ్చి వారితో మాట్లాడమని చెప్పారని వివరించారు. ఎమ్మెల్యే కార్యక్రమం నుండి తిరిగి వస్తున్న సమయంలో తమ గ్రామానికి రమ్మనడంతో వెళ్లడం జరిగిందన్నారు. అక్కడ డిన్నర్ చేసిన తర్వాత ఫోటో దిగారని తెలిపారు.
ఒక వెంచర్ ఆఫీస్ ప్రారంభానికి మంగ్లిని ఆహ్వానించగా, అలాంటి కార్యక్రమాలకు తాను రాలేనని ఆమె చెప్పారని శివ చౌహన్ పేర్కొన్నారు. ఆమె రాకపోవడంతో, తనను పిలిచి జూన్ 9న అక్కడ ఫోటోలు తీయించారని తెలిపారు. జూన్ 10న మంగ్లి పుట్టినరోజు కావడంతో, ఏర్పాట్లను చూసుకోవడానికి వెళ్లేటప్పుడు, ఆమెతో వచ్చిన డ్రైవర్లు ఆమె ఫోటోలు తీశారని, ఆ ఫోటోలను చూపిస్తూ తమకు డబ్బులు ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
రియల్ ఎస్టేట్ ఆఫీస్‌కు ఆఫీస్ కట్టాలని అడగడంతో, తనకు చెందిన ప్లాట్‌ను చూపించామని, అదే ప్లాట్‌ను కొంటామని అడ్వాన్స్ ఇచ్చి, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వారితో పరిచయం పెరిగిందని శివ చౌహన్ తెలిపారు. హేమాకాంత్ రెడ్డి, రమాకాంత్ లు తాను లేని సమయంలో తమ గ్రామానికి వచ్చారని ఆయన పేర్కొన్నారు. తాము మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని, తాను నమ్మే హనుమాన్, సేవాలాల్పై ఒట్టు వేసి చెబుతున్నానని, ఈ ఆరోపణలు నిజం కాదని అన్నారు. మంగ్లిపై కుట్రపూరితంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని, ఈ విషయం వల్ల తమ కుటుంబానికి పరువు నష్టం కలిగిందని తెలిపారు.
పోలీసుల నుండి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత న్యాయస్థానం ద్వారా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని శివ చౌహన్ తెలిపారు. బాధితుల తరపున తాము పోరాడతామని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని, ప్రజలు ఈ విషయాలను గమనించాలని కోరారు. 14 సంవత్సరాలుగా కష్టపడి పైకి వచ్చామని, తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. 60-90 కేసుల్లో ఎక్కడా తమ పేర్లు లేవని, బాధితులు కూడా తమ పేర్లను ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు నిరాధారమని, మీడియా ద్వారా తప్పుదారి పట్టిస్తున్నారని, కోర్టులో పోరాడకుండా మీడియా ముందుకు రావడం సరికాదని వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ బెదిరింపులకు పాల్పడలేదని, కాల్ లేదా మెసేజ్ కూడా చేయలేదని, సోషల్ మీడియాలో మంగ్లిని లక్ష్యంగా చేసుకుంటున్నారని, చట్టం ముందు వాస్తవాలు బయటపడతాయని నమ్మకం ఉందని తెలిపారు.











