రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంథనిలో గురువారం నాడు యాంటీ నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ సమక్షంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెద్దపల్లి నార్కోటిక్ బృందం, మంథని పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలను చేపట్టారు. మంథని బస్టాండ్ పరిసర ప్రాంతాలు, పట్టణంలోని పలు చోట్ల, ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
బైక్ పార్కింగ్ ప్రాంతాలు, ఆటో స్టాండ్లు, హోటళ్లు, పాన్ షాపులలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించినా, సేవించినా లేదా రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంథని ఎస్ఐ రమేష్ హెచ్చరించారు.
యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలు పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘాను చాటుతున్నాయి.











