నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆదేశాల మేరకు బుధవారం చీతా ఫోర్స్ బృందాలు రెండు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించి, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 10 ట్రాక్టర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నాయి. ఈ దాడుల వివరాలను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు.
పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ పర్యవేక్షణలో చీతా ఫోర్స్ సిబ్బంది అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో, నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాళేశ్వర్ గ్రామ వాగు ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.
వాగు నుంచి జేసీబీ సహాయంతో ఇసుక తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, అక్కడి ఒక జేసీబీతో పాటు ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ వాహనాలను నందిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు.
అదేవిధంగా, నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లవేద గ్రామ వాగులో కూడా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు, మరో ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు. వీటిని నవీపేట్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.
ప్రకృతి వనరుల దోపిడీ, అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ఎక్కడైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలను గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.








